సూచిక 
ప్రముఖ మాధ్యమాల నుండి వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.ఖమ్మం
Minister Thummala Nageswara Rao: రైతన్న ఇంట సిరులు కురిపించే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణతో అడుగులేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ గెలలు టన్ను ధర రూ.20 వేలకు పైగా ఉందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు యాంత్రీకరణ దిశగా తెలంగాణ వ్యవసాయం అడుగులు వేస్తు్ందని చెప్పారు.









స్థానిక మట్టితో తయారు చేసిన ఇటులతో నిర్మించిన ప్రహరీ పరిశీలన ములకలపల్లి, వెలుగు : స్థానికంగా లభించే నాణ్యమైన మట్టితో మంచి ఇటుకలు తయారవ

టేకులపల్లి ఉప తపాలా కార్యాలయంలో శనివారం అర్ధరాత్రి చోరీయత్నం జరిగింది.

కూసుమంచి మండలం గైగొళ్లపల్లికి చెందిన ఓ యువకుడు కొన్నాళ్లుగా బెట్టింగ్‌కు బానిసయ్యాడు. రూ.5-6లక్షలు అప్పు చేయటంతో వాటిని తీర్చలేక మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు.

విద్యుత్ రంగంలో ఏదైనా యూనిట్ నిరాటంకంగా వంద రోజులు ఉత్పత్తి సాగించటమనేది అరుదనే చెప్పాలి. అతి తక్కువ సామర్థ్యం గల యూనిట్లలో రోజుల వ్యవధిలోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయి.

చారిత్రక కట్టడాలు, ఆనవాళ్లను పరిరక్షించాల్సిన పురావస్తుశాఖ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరి కొన్నేళ్లు ఇదే తీరు కొనసాగితే ఆ శాఖ కూడా పురావస్తు జ్ఞాపకాల్లో ఒకటిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

రైతు వేదిక నిర్వహణ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ.4 లక్షలు అప్పు చేశాను. 28 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

ప్రాదేశిక ఎన్నికలకు జిల్లా పరిషత్ కార్యాలయ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణపై పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతున్నాయి.

ఎంపీటీసీ (మండల ప్రాదేశిక నియోజకవర్గం), జడ్పీటీసీ (జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం) స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఖరారు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది.

ఓవైపు విధి నిర్వహణకు ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు క్రీడలపై మక్కువతో రోజూ సాధన చేస్తున్నారు. అటు ఉద్యోగ బాధ్యతలు, ఇటు క్రీడా పోటీల్లో రాణించాలనే తపనే తమకు చోదకశక్తి అని చాటిచెబుతున్నారు.

చెల్లిని ఆర్టీసీ బస్సు ఎక్కించి, తన కాలేజీ బస్సును ఎక్కేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన గోపవరం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

ఆల్ ఇండియా డీఏఈ 39వ ఇంటర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఈనెల 10 నుంచి 14 వరకు అశ్వాపురం మండలంలోని గౌతమీనగర్‌లో అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన ఘటన ములకలపల్లి మండలంలో చోటుచేసుకుంది.


తప్పించుకొని బంధువులకు చెప్పిన బాధితురాలు నిందితుడైన ఆటోడ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించిన

భద్రాచలం, వెలుగు : భీష్మ ఏకాదశి సందర్భంగా శనివారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య పాదుకలకు భద్రుడి మ

సాధ్యసాధ్యాలపై అధ్యయనం సింగిల్ టెండర్ విధానానికి సమాలోచనలు ఇసుక అమ్మకాల్లో అక్రమాల ఆరోపణలతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తున్న ఆదివాసీ సంఘాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య వారధిలా పనిచేస్తోంది. ఆనకట్ట పైనుంచి వర్షాకాలం మొదలు కొద్దిరోజుల కిందటి వరకు నీరు ప్రవహించింది. దీంతో జలపాతం మాదిరి కనిపించగా ఇప్పుడు గోదావరి నీటిమట్టం తగ్గడంతో ఆనకట్ట బయటపడి వారధిలా పనిచేస్తోంది. ఏటా ఈ ఆనకట్ట వేసవిలో వారధిలా, శీతాకాలంలో జలపాతంలా, వర్షాకాలంలో నీరు ఉప్పొంగుతూ కొత్త అందాలు సంతరించుకుంటుంది. అయితే, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. – అశ్వాపురం Sun, Feb 9 2025 1:02 AM
●సోలార్ అండగా.. చెరుకు రసం దండిగ! రోజురోజుకూ సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన పెరుగుతుండటంతో ఇళ్ల యజమానులతో పాటు చిరువ్యాపారులు సైతం అందిపుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా పాల్వంచ క్రాస్ రోడ్డులో చెరుకు రసం అమ్మే చిరు వ్యాపారి తన వాహనానికి సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ద్వారా వాహనంలోని యంత్రాన్ని నడిపిస్తూ చెరుకు రసం తీసి విక్రయిస్తున్నాడు. ఒకసారి సోలార్ ప్లేట్లు బిగించుకుంటే చాన్నాళ్లు ఇబ్బంది లేకుండా కొనసాగుతుందని.. తద్వారా బ్యాటరీల ఖర్చు వంటివి తగ్గుతాయని సదరు వ్యాపారి వెల్లడించాడు. – పాల్వంచ Sun, Feb 9 2025 1:02 AM

● మార్చి 31లోగా నగదు చెల్లిస్తే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు వైద్యసేవలు ● రూ.60 వేలు కడితే రూ.8 లక్షల విలువైన చికిత్స సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు పరిశ్రమల్లో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కోలిండియా కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ – నాన్ ఎగ్జిక్యూటివ్ (సీపీఆర్ఎంఎస్ – ఎన్ఈ)ను అమలు చేస్తోంది. ఇందులో చేరేందుకు గడువును మార్చి 31వరకు పొడిగించారు. ఈ విషయమై కోలిండియా తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణి యాజమాన్యం గత జనవరి 31న ఉత్తర్వులు జారీ చేసింది. రూ.8 లక్షల విలువైన వైద్యం బొగ్గు పరిశ్రమల్లో పనిచేసి రిటైర్డ్ కార్మికులకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాల్సి ఉన్నప్పటికీ నగదు చెల్లించాల్సిదేనని యాజమాన్యాలు స్పష్టం చేయడంతో గతంలో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే సీపీఆర్ఎంఎస్ – ఎన్ఈను 2019లో అమల్లోకి తీసుకొచ్చారు. తొలినాళ్లలో రూ.10 వేలు కడితే ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో చికిత్స అందేది. ఆ తర్వాత రూ.40 వేలకు పెంచి రూ.8 లక్షల విలువైన చికిత్స చేయించడానికి అంగీకారం కుదిరింది. అయితే, సకాలంలో చాలా మంది సభ్యులుగా చేరకపోవడంతో మరో రూ.20 వేలు పెంచి రూ.60 వేలు కట్టడానికి మార్చి 31 వరకు గడువు పొడిగించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా.. బొగ్గుగనుల్లో పనిచేసే సమయాన కార్మికులు అనారోగ్యం బారిన పడితే ఏరియా, ప్రధానాస్పత్రుల్లో వైద్యసేవలు అందుతాయి. అయితే విరమణ అయ్యాక వీరికి ఉచితంగా వైద్యసేవలు ఇవ్వలేమని చెబుతూ సీపీఆర్ఎంఎస్ కార్డ్‌ను ప్రవేశపెట్టారు. ఏటా లైవ్ సర్టిఫికెట్ సమర్పించి.. దీనిని రెన్యూవల్ చేసుకుంటే సుమారు 156 ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించేలా నిర్ణయించారు. కాగా, హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల్లో కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ కార్డ్ చూపిస్తే ఎలాంటి షరతులు లేకుండా వైద్యసేవలు అందిస్తారని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. ఇందుకోసం సింగరేణి భవన్లో ప్రత్యేకాధికారిని సైతం నియమించారు. కానీ, కొన్ని ఆస్పత్రులు మెరుగైన సేవలందిస్తుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం నామమాత్రపు సేవలు అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడం ఇలా.. సీపీఆర్‌ఎంఎస్‌లో చేరేందుకు మూడు సెట్ల దరఖాస్తులు, రిటైర్డ్ ఉద్యోగి, భార్య, నామినీవి ఐదు చొప్పున ఫొటోలు, ముగ్గురివి మూడేసి ఆధార్ కార్డు కాపీలతో పాటు కంపెనీలో తొలగించిన నాటి లేఖ, బ్యాంకు ఖాతా పుస్తకం కలర్ జిరాక్స్ మూడు సెట్లు సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాక చివరి నెల వేతనం జిరాక్స్, రిటైర్డ్ ఉద్యోగి దంపతుల పాన్‌కార్డులు కూడా జత చేయాలి. ఒకవేళ దివ్యాంగులైన పిల్లలు ఉంటే మరో రూ.20 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఏరియా వారీగా పరిశీలిస్తే ఇప్పటివరకు కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో 1,642 మంది, కొత్తగూడెం ఏరియాలో 2,761, మణుగూరు ఏరియాలో 2,248, ఇల్లెందు ఏరియాలో 1,369 మంది రిటైర్డ్ ఉద్యోగులు కార్డుల కోసం నగదు చెల్లించారు. Sun, Feb 9 2025 1:03 AM

● ఇల్లెందులో ‘డిజిటల్ లైబ్రరీ’ కోసం ఎదురుచూపులు ● పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ● ఆన్లైన్ సదుపాయం లేక ఉన్న పుస్తకాలతోనే ప్రిపరేషన్ ఇల్లెందు: ఏళ్ల తర్వాత ఇల్లెందులో సువిశాలమైన గ్రంథాలయ భవనం అందుబాటులోకి వచ్చింది. ఈ భవన నిర్మాణానికి 2023లో నాటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, అప్పటి ఎమ్మెల్యే బానోతు హరిప్రియ శంకుస్థాపన చేయగా, గత నెల 22న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. రూ.కోటి వ్యయంతో నిర్మించిన ఈ భవనం అందుబాటులోకి రావడంపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నా ఆన్లైన్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, చర్ల, ఇల్లెందులో గ్రంథాలయాలకు విశాలమైన భవనాలు అందుబాటులో ఉండగా, పాల్వంచలో డిజిటల్ గ్రంథాలయం కూడా నెలకొల్పారు. ఇల్లెందులో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఇరుకు సందులో పాత భవనం ఇల్లెందు గోవింద్ సెంటర్లోని ఇరుకు సందులో పురాతన భవనంలో గ్రంథాలయం కొనసాగేది. పట్టుమని పది మంది వచ్చినా కూర్చునేందుకు సదుపాయం లేకుండానే నిరవహించారు. ఆ తర్వాత జేకేకాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నూతన భవనం ఇటీవల అందుబాటులోకి వచ్చింది. ఇందులో విశాలమైన రీడింగ్ హాల్, వేలాది పుస్తకాలు, ఎంతసేపు కూర్చున్నా ఇబ్బంది ఎదురుకాని తరహాలో నాణ్యమైన కుర్చీలను సమకూర్చారు. ఇందులో రీడింగ్ హాల్, విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా ఉండగా ఏకకాలంలో 150 మంది వరకు చదువుకోవచ్చు. డిజిటల్ కోసం ఎదురుచూపులు అత్యాధునిక వసతులతో గ్రంథాలయ భవనం అందుబాటులోకి తీసుకొచ్చిన యంత్రాంగం డిజిటల్ సౌకర్యం మాత్రం కల్పించలేదు. ఐదు నుంచి 10 కంప్యూటర్లు, వైఫై సదుపాయం కల్పిస్తే ఆన్లైన్లో పోటీ పరీక్షల సమాచారం తెలుసుకుని జర్నల్స్ చదువుకునే వెసలుబాటు కలుగుతుందని నిరద్యోగులు చెబుతున్నారు. రూ.వేలల్లో వెచ్చించి దూర ప్రాంతాల్లో శిక్షణ తీసుకునే పరిస్థితి లేని తమలాంటి వారి కోసం ఇక్కడ ఆన్లైన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. నిధులు లేక డీలా.. గ్రంథాలయాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదు. మొక్కుబడిగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. తద్వారా ఆశించినంత మేర ఆదాయం లేక తాగునీరు, విద్యుత్, పేపర్ బిల్లుల చెల్లింపునకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు చెల్లించే పన్నుల్లో 10 శాతం లోపు గ్రంథాలయాలకు సెస్ ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడం గమనార్హం.ఒకేసారి 150మంది చదువుకోవచ్చు లైబ్రరీని నిరుద్యోగుల కోసం అధిక సమయం తెరిచి కొనసాగిస్తున్నాం. డిజిటల్ విభాగం కూడా ఏర్పాటైతే వారికి మరింత ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. గ్రంథాలయంలో 150 మంది ఏకకాలంలో చదువుకునే అవకాశం ఉంది. –రుక్మిణి, లైబ్రేరియన్ప్రత్యేక చొరవ చూపాలి.. గ్రంథాలయంలో డిజిటల్ విభాగం ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరం. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్‌తో పాటు ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ చూపితే నిరుద్యోగులకు మేలు చేసిన వారవుతారు. –కాళంగి హరికృష్ణ, ఇల్లెందు డిజిటల్ విభాగం ఉంటే మేలు.. లైబ్రరీలో డిజిటల్ విభాగం కూడా నెలకొల్పితే మేలు జరుగుతుంది. దూరప్రాంతాల్లో శిక్షణకు వెళ్లలేని మాలాంటి వారికి ఆన్లైన్ అందుబాటులోకి వస్తుంది. అంతేకాక ఎక్కువ సమయం తెరిచే ఉంచడంపై దృష్టి సారించాలి. –శ్రీను, ఇల్లెందు Sun, Feb 9 2025 1:02 AM

మధిర: సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఇన్నాళ్లు కొనసాగుతున్న మధిర సహా మరికొన్ని రైల్వేస్టేషన్ల పరిధి దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి మారనుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇందుకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధంచేయాలని సైతం రైల్వే బోర్డును ఆదేశించింది. ఇది అమల్లోకి వస్తే కొండపల్లి నుంచి మోటమర్రి సెక్షన్ వరకు 46 కి.మీ. పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లు కొత్త జోన్లోకి వెళ్లనున్నాయి. జిల్లాలో నాలుగు స్టేషన్లు కొండపల్లి – మోటమర్రి మధ్యలో చెరువు మాధవరం, గంగినేని, ఎర్రుపాలెం, తొండల గోపవరం, మధిర స్టేషన్లు ఉన్నాయి. ఇందులో మధిర సహా మోటమర్రి, తొండల గోపవరం, ఎర్రుపాలెం తెలంగాణ సరిహద్దు ఖమ్మం జిల్లా పరిధిలో ఉండగా, ఇవన్నీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మారతాయి. ఫలితంగా ఇన్నాళ్లు రైల్వే సంబంధిత పనుల కోసం సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయానికి వెళ్తున్న ఉద్యోగులు ఇకపై రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్ఎం)ను కలవాలంటే విజయవాడకు, జనరల్ మేనేజర్(జీఎం)ను కలవాలంటే విశాఖపట్నం వెళ్లాల్సి వస్తుంది. అలాగే, మధిర కేంద్రంగా పనిచేస్తున్న కొండపల్లి – మోటమర్రి సెక్షన్ పరిధి ఉద్యోగులను సికింద్రాబాద్ డివిజన్‌కు కేటాయించి, ఈ ప్రాంతానికి కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఉద్యోగులను కేటాయిస్తారని రైల్వేవర్గాల తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న నాలుగు స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ కేంద్రంగా ఏర్పడే కొత్త జోన్ పరిధిలోకి మారనున్న నేపథ్యాన ఉద్యోగులు, స్థానికులకు ఇక్కట్లు ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేలా ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని పలువురు కోరుతున్నారు.విశాఖ కేంద్రంగా ఏర్పాటుకానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ Sun, Feb 9 2025 12:25 AM

కూసుమంచి/నేలకొండపల్లి/ఖమ్మం రూరల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే ప్రాధాన్యతాక్రమంలో అన్నింటినీ పరిష్కరిస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో శనివారం ఆయన సమావేశమయ్యారు. గ్రామాల్లో సమ్యలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చించాక మంత్రి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు. కాగా, గిరిజన సంఘాల నాయకులు మంత్రిని సన్మానించి సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు ఆహ్వానించారు. అలాగే, కూసుమంచి మండలం జీళ్లచెరువులోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రి పొంగులేటికి అందజేశారు. ఈనెల 8నుంచి 13వరకు జరిగే ఉత్సవాలకు హాజరుకావాలని నేలకొండపల్లి మండలంలోని కొత్తకొత్తూరుకు చెందిన పలువురు కోరారు. కాగా, మంత్రి ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఆత్మకమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, నాయకులు భద్రయ్య, కుక్కల హన్మంతరావు, కొండబాల రాంబాబు, రాయపూడి శ్రీనివాస్, బాలసాని లక్ష్మీనారాయణ, బొర్రా రాజశేఖర్, కొప్పుల చంద్రశేఖర్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి Sun, Feb 9 2025 12:25 AM
తల్లాడ: రసాయన మందులు వాడకుండా ప్రకృతి సిద్ధంగా ఆరేళ్ల నుంచి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన అయిలూరి చిన్న లక్ష్మారెడ్డి. సేంద్రియ విధానంలో వరి సాగు చేయడమే కాక పంటను సొంతంగా తన ఇంట్లోని మిల్లులో ఆడించి విక్రయిస్తున్నారు. ఆయనకు ఉన్న మూడెకరాలకు తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని ఖరీఫ్, రబీ సీజన్లలో కుర్నవల్లి ఏటి కింద వరి సాగు చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో విజయ్‌రామ్, సేవ్ కార్యాలయం నుంచి విత్తనాలు తెచ్చి సాగు చేయగా.. ఆ తర్వాత సొంతంగానే విత్తనాలు రూపొందించుకుంటున్నారు. ఎకరానికి 20 బస్తాల వరకు వరి దిగుబడి సాధిస్తున్న లక్ష్మారెడ్డి వాటిని నేరుగా కాకుండా విత్తనాలుగా, బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు. బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ రకాల్లోని నారాయణ కామిని, బహురూపి, నవారా, కులాకర్, చిట్టి ముత్యాలు, మైసూరు మల్లిక, కుజ్బీ పటాలియా, కాలాబట్టీ(బ్లాక్‌రైస్) వంటివి సాగు చేస్తున్నారు. ఈ పంటల నుంచి ఆసక్తి గల రైతులకు విత్తనాలను కిలో రూ.వంద చొప్పున విక్రయిస్తున్నారు. తన ఇంటి వద్దే ఏర్పాటు చేసుకున్న మిల్లులో వడ్లను మర ఆడించి ముడి బియ్యంగా మారుస్తున్న లక్ష్మారెడ్డి 10 కిలోలు మొదలు 25, 50కిలోల బస్తాలుగా అవసరమైన వారికి అమ్ముతున్నారు. కాగా, ప్రకృతి సిద్ధంగా పండించిన వడ్లను బియ్యంగా మార్చాక కల్తీ లేకుండా విక్రయిస్తుండడంతో లక్ష్మారెడ్డిని సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొదట్లో కాస్త మందకొడిగా విక్రయాలు సాగినా ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బెంగళూరు వంటి ప్రాంతాలకు సైతం బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. రెడ్ రైస్ కేజీ రూ.100, బ్రౌన్‌రైస్ రూ.90, బ్లాక్ రైస్ రూ.150 చొప్పున అమ్ముతున్నారు. ఈసందర్భంగా లక్ష్మారెడ్డిని పలకరించగా సుభాష్ పాలేకర్ బాటను అనుసరిస్తూ ఆరేళ్లుగా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. వరి విత్తనాలతో పాటు బియ్యానికి మంచి గిరాకీ ఉందని, నేరుగా పంటను కాకుండా విత్తనాలు, బియ్యంగా విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.సొంతంగా ఏర్పాటు చేసుకున్న రైస్ మిల్లుతో... Sun, Feb 9 2025 12:25 AM

సేంద్రియ సాగు..దిగుబడి పెరగాలని, తెగుళ్లను అరికట్టాలనే తపనతో రైతులు ఇబ్బడిముబ్బడిగా రసాయన ఎరువులు వాడుతుండడంతో భూసారం దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయాన పంట ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు చేరుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో కొందరు రైతులు రసాయన ఎరువులను పూర్తిగా పక్కనపెట్టగా సేంద్రియ విధానంలో సాగుకు ముందడుగు వేశారు. ఈ విధానంలో తొలినాళ్లలో శ్రమ ఉండడం, సరైన దిగుబడి లేకపోవడం వంటి పరిస్థితులు ఎదురైనా ప్రజల్లో ఉన్న ఆదరణతో ఒకరిని చూసిన ఇంకొకరు సేంద్రియ సాగు బాట పడుతున్నారు. ఈక్రమాన జిల్లాలో పూర్తిగా సేంద్రియ విధానంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న రైతుల్లో కొందరి పరిచయం. Sun, Feb 9 2025 12:24 AM

మధిర: మధిర మండలం నిధానపురానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు వట్టివేళ్ల సురేందర్‌రెడ్డి మిల్లెట్స్(చిరుధాన్యాలు)తోనే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఆచరించి చూపిస్తున్నారు. ఆయనకు 2020 సంవత్సరంలో అనారోగ్య సమస్య ఎదురైంది. కేన్సర్ అనే అనుమానాలు వ్యక్తమైనా పరీక్షల్లో నిర్ధారణ కాలేదు. అయితే, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడిన ఆహార ఉత్పత్తులను తినడంతో కేన్సర్ ముప్పు ఉంటుందని తెలియడంతో కొంతమేర సొంత అవగాహన.. ఇంకొంత గూగుల్, యూట్యూబ్ ద్వారా తెలుసుకోవడమే కాక ఎక్కడ ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగుపై శిక్షణ ఉన్నా హాజరయ్యేవారు. ఆ తర్వాత ఐదేళ్ల నుంచి నాలుగెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఎకరాల్లో మిల్లెట్స్ అయిన కొర్రలు, అండు కొర్రలు, సామలు, రాగులు, నల్ల పెసర, మినుము సాగు మొదలుపెట్టారు. అంతేకాక సొంతంగా గోకృపామృతం తయారు చేస్తూ దేశీయ ఆవులను పోషిస్తున్నారు. వరిలో నవారా, మైసూర్ మల్లిక, కుంకుమశాలి, కాలాబట్టి, రత్నచోడి వంటి దేశీయ రకాలు సాగు చేస్తూ ఆ బియ్యాన్నే సొంత అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కాగా, 200 లీటర్ల డ్రమ్ములో 180 లీటర్ల నీరు పోసి రెండు కేజీల దేశీయ బెల్లం, రెండు లీటర్ల మజ్జిగతో పాటు అంతకు ముందే ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త గోపాల్ బాయి సుపారియా సూచనలతో చేసిన రెండు లీటర్ల గోకృపామృతం కలుపుతారు. రోజుకు మూడుసార్లు కలియతిప్పుతుండగా నాలుగైదు రోజుల్లో గోకృపామృతం తయారవుతుంది. దీంతో పాటు దేశీయ ఆవు మూత్రం, దేశీయ ఆవు మజ్జిగ, వేపగింజల కషాయంతో తెగుళ్ల నివారణ సాధ్యమవుతోందని సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఆహారాన్ని తీసుకోవడం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. చిరుధాన్యాల సాగుకు ఎలాంటి మందుల పిచికారీ అవసరముండదని చెప్పారు. దేశీయ ఆవులు పెంచుతూ వాటి పాలు, పెరుగు, నెయ్యి తయారు చేసి వాడుతుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. Sun, Feb 9 2025 12:24 AM

పది ఎకరాల్లోనూ సేంద్రియ సాగే కామేపల్లి: కామేపల్లి మండలం పింజరమడుగుకు చెందిన నూతలపాటి సత్యనారాయణ పర్యావరణానికి హాని కలగకుండా, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా 12ఏళ్ల నుంచి సేంద్రియ సాగు చేపడుతున్నాడు. సహజ సిద్ధ(ఆర్గానిక్) పంట ఉత్పత్తులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉండడంతో ఆయన వాణిజ్య, ఉద్యాన పంటల సాగులో రాణిస్తున్నాడు. సత్యనారాయణ తనకు ఉన్న పదెకరాల భూమిలో మిర్చి, పత్తి, వరి, ఇతర పంటలను సాగు చేసేవాడు. అయితే, రసాయన ఎరువులు, పురుగు మందులతో ఎదురవుతున్న నష్టం, పెరుగుతున్న పెట్టుబడుల దృష్ట్యా తొలుత కొంత భూమిలో సేంద్రియ సాగు విధానం అవలంబించగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఎకరంలో వరి, మూడెకరాల్లో మిరప సాగు చేస్తూ ఆరు ఎకరాల్లో సీతాఫలం తోట వేశారు. పశువుల ఎరువు, జీవామృతం, వేప, ముష్టి, సీతాఫలం, ఊడుగు ఆకుల కషాయం, వేప పిండి వినియోగించి సొంతంగా కషాయాలను తయారు చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, పంట కోతల తర్వాత మిగిలిపోయిన అవశేషాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నుతుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, కలుపు నివారణకు మందులు వాడకుండా కూలీలతోనే తీయిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇంటి పక్కనే ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలోనూ పండ్ల మొక్కలను సత్యనారాయణ నాటారు. నోని, అంజురా, మామిడి, సపోట, పనస, వాటర్ ఆపిల్, జామ, దానిమ్మ, సీతాఫలం, ఆపిల్ బేర్, నిమ్మ, కొబ్బరి, అరటి, ఉసిరి, డ్రాగన్ ఇలాంటివే కాక ఇంట్లో అవసరమయ్యే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లి, ఎల్లిపాయలు, వాము, ధనియాలు కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సేంద్రియ సాగుకు అవసరమైన కషాయం వంటివి సిద్ధం చేసుకోవడం కాస్త కష్టంగా ఉన్నా ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. అలాగే, రసాయన అవశేషాలు లేని పంటలు పండిస్తున్నాననే తృప్తి ఉందని వెల్లడించారు. Sun, Feb 9 2025 12:24 AM

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూల విరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అమ్మ వార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరిపించడమే కాక వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన పల్లకీసేవ నిర్వహించారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన నర్సింగోజు శశాంక్– కావ్య దంపతులు ఆలయంలో నిత్యాన్నదానానికి రూ.1,00,016 విరాళం అందచేశారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. హైవే హద్దుల నిర్ధారణకు సర్వే రఘునాథపాలెం: నాగపూర్–అమరావతి నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా ప్లాట్లు కోల్పోతున్న వారి వినతితో హద్దుల నిర్ధారణకు సర్వే చేయిస్తున్నారు. రఘునాథపాలెం తహసీల్దార్ లూథర్ విల్సన్, ఆర్ఐలు సతీష్, ప్రవీణ్, సర్వేయర్ శివ, నేషనల్ హైవే అఽథారిటీ ఇంజనీర్ల ఆధ్వర్యాన శనివారం సర్వే చేశారు. రఘునాథపాలెం, వీ.వీ.పాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో పలువురు ప్లాట్ల యజమానులు హైవే నిర్మాణంలో ఎంత భూమి కోల్పోతున్నామో మార్కింగ్ చేయాలని ఇటీవల ఆర్డీఓకు విన్నవించగా సర్వే ద్వారా నిర్ధారించారు. జిల్లాకు చేరిన 118 బ్యాలెట్‌బాక్స్‌లు ఖమ్మం సహకారనగర్: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మాస్టర్ ట్రెయినీలు మాధవి, రాజేశ్వరి ద్వారా పలువురు ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. వీరు మండలాల వారీగా సిబ్బందికి త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 24 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనుండగా శనివారం జిల్లాకు 118 జంబో బ్యాలెట్ బాక్స్‌లు చేరాయి. వీటిని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చినట్లు డీఆర్ఓ పద్మశ్రీ తెలిపారు. ప్రశాంతంగా ‘నవోదయ’ ప్రవేశపరీక్ష కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యాసంవత్సరం 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి శనివారం ప్రవేశపరీక్ష నిర్వహించారు. పాలేరులోని నవోదయ విద్యాలయలో 9వ తరగతికి, కూసుమంచిలోని ఉన్నత పాఠశాల, ఖమ్మంలోని ఎన్నెస్సీ కాలనీ, రిక్కాబజార్, శాంతి నగర్ ఉన్నత పాఠశాలల్లో 11వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశానికి 753 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 544 మంది, 11వ తరగతిలో 1,384 మందికి గాను 1,182 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని పలు కేంద్రాలను డీఈఓ సోమశేఖరశర్మ, కూసుమంచి తహసీల్దార్ కరుణశ్రీ, నవోదయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పర్యవేక్షించారు. Sun, Feb 9 2025 12:24 AM

ఖమ్మంగాంధీచౌక్: మహాశివరాత్రి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం ఆలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎం.వీరస్వామి సూచించారు. ఖమ్మంలోని కార్యాలయంలో వివిధ ఆలయాల ఈఓలు, అర్చకులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ ఈనెల 26న జరిగే మహాశివరాత్రి వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరు కానున్నందున చలువ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయడమే కాక తాగునీరు, వైద్యసదుపాయాలు కల్పించాలని సూచించారు. అలాగే, భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం డివిజన్ ఇన్స్పెక్టర్ ఈ వెంకటేశ్వర్లు, ఈఓలు కొత్తూరు జగన్మోహన్రావు, సమత, వీ.వీ.నర్సింహారావు, నలమోతు శేషయ్య, చుండూరు రామకోటేశ్వరరావు, సుదర్శన్, కె.వేణుగోపాలాచార్యులు, హరిచంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి Sun, Feb 9 2025 12:24 AM

ఖమ్మంవ్యవసాయం: సేంద్రియ విధానంలో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో గ్రామ భారతి, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన మెగా ఆర్గానిక్ మేళాను శనివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పలువురు రైతులు ఇప్పటికే సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించగా, వినియోగదారులు సైతం ఈ విధానంలో పండిన ఉత్పత్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈనేపథ్యాన ఖమ్మంలో ఆర్గానిక్ మేళా ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధి నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతీనెల రెండో శని, ఆదివారాల్లో మేళా నిర్వహిస్తామని, ఇక్కడ సేంద్రియ విధానంలో సాగుచేసిన కూరగాయలు, దంపుడు బియ్యం, దేశవాళీ ఆవు నెయ్యి, చిరుధాన్యాలు, పసుపు, బెల్లం, తేనె అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు మంజుల, కమర్తపు మురళి, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రమేష్‌రెడ్డి, నారాయణరావు, కుతుంబాక మాధవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:24 AM

● టీ శాట్, యూట్యూబ్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు ఖమ్మంసహకారనగర్: పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రేరణ, సబ్జెక్ట్ నిపుణులతో అవగాహన కల్పించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 11న టీ శాట్, యూట్యూబ్ ద్వారా పరీక్షలకు సిద్ధం కావాల్సిన విధానం, ప్రశ్నపత్రంపై అవగాహన కల్పిస్తారు. జిల్లాలోని 434 పాఠశాలల్లో చదువుతున్న 16,416 మంది పదో తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమాలను వీక్షించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పాఠశాలల్లో టీవీలు, ప్రొజెక్టర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో, లేదో ముందుగా పరిశీలించాలని అధికారులు సూచించారు. లైవ్ టెలికాస్ట్ సమయాన స్క్రీన్‌పై కనిపించే నంబర్లకు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశమూ ఉందని తెలిపారు. మంచుకొండ లిఫ్ట్ పనుల పరిశీలన రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని చెరువులకు, అక్కడి నుంచి సాగు అవసరాలకు నీరు సరఫరా చేసేందుకు వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వపై మంచుకొండ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను శనివారం జలవనరులశాఖ సీఈ రమేష్, ఎస్ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. పంపు హౌస్, పైపులైన్ పనులపై ఆరా తీసిన వారు మరింత వేగం పెంచాలని సూచించారు. ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:24 AM
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని మహిళా ప్రాంగణం, డైట్ కళాశాలల్లో ఈ నెల 10న విద్యార్థుల కోసం అవగాహన సదస్సులు, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఈ.సోమశేఖరశర్మ తెలిపారు. పాఠశాలల నుంచి బయాలజీ ఉపాధ్యాయులు, 8, 9వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనాలని సూచించారు. పోస్టర్ల తయారీ పోటీల్లో పాల్గొనేందుకు చార్ట్‌లు, రంగులు ఎవరికి వారే తెచ్చుకోవాలని తెలిపారు. చోరీ ఘటనలో ఇద్దరి అరెస్ట్కూసుమంచి: గత ఏడాది ఏప్రిల్‌లో కూసుమంచికి చెందిన బిక్కసాని నరేశ్ ఇంట్లో చోరీ చేసిన నిందితులను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టగా మండలంలోని సోమ్లాతండాకు చెందిన బానోత్ నవీన్, భగవత్‌వీడు తండాకు చెందిన భూక్యా సురేశ్ చోరీ చేసినట్లు తేలిందని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగున్నర తులాల బంగారు గొలుసు, రూ.62 వేల నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. ద్విచక్రవాహనం దొంగ అరెస్ట్ఖమ్మంక్రైం: ద్విచక్రవాహనాన్ని చోరీ చేసిన వ్యక్తిని ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఖమ్మం రిక్కాబజార్ ప్రాంతానికి చెందిన పాలడుగు విజయ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా జమ్మిబండ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యాన ఇటీవల బైక్ చోరీ చేసినట్లు అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. Sun, Feb 9 2025 12:24 AM
చింతకాని: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు సూచించారు. మండలంలోని నేరడలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐతో కలిసొచ్చే పార్టీలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. వార్డు సభ్యులు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయడమే కాక అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని సూచించారు. అనంతరం పార్టీ గ్రామశాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామశాఖ కార్యదర్శి షేక్ దస్తగిరి, సహాయ కార్యదర్శులు మట్టా రవి, కాటిరాల మహేశ్‌తో పాటు మరో 16 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, కొండపర్తి గోవిందరావు, దూసరి శ్రీరాములు, పావులూరి మల్లికార్జున్‌రావు, దూసరి గోపాల్‌రావు, గోగుల ఆదినారాయణ, పెరిక ప్రభాకర్, మట్టా వెంకట్రావు, నరేశ్, ఆంథోని, గోగుల వెంకన్న పాల్గొన్నారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు Sun, Feb 9 2025 12:24 AM

కామేపల్లి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, కొన్నిచోట్ల టీచర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఇలాంటి ఘటనే మండలంలో చోటు చేసుకుంది. కామేపల్లి మండలంలోని రాయిగూడెం–2 అంగన్వాడీ కేంద్రం టీచర్ కమలమ్మ శనివారం విధులకు హాజరుకాలేదు. దీంతో ఆయా అవంతిక కేంద్రాన్ని తెరిచి ఇద్దరు చొప్పున గర్భిణులు, బాలింతలు, తొమ్మిది మంది చిన్నారులకు పౌష్టికాహారం అందించినట్లు రికార్డులో నమోదు చేసింది. అయితే, అవంతిక కుమార్తె మాత్రమే అక్కడ కనిపించగా మిగతా చిన్నారులు ఎక్కడ ఆని ఆరా తీస్తే నలుగురే వచ్చారని, టీచర్ సూచనలతో అందరికీ హాజరు వేశానని చెప్పడం గమనార్హం. ఈ విషయమై ఐసీడీఎస్ సీడీపీఓ దయామణిని వివరణ కోరగా టీచర్ కమలమ్మ అనుమతి లేకుండా గైర్హాజరైనందున చర్యలు తీసుకుంటామని తెలిపారు. Sun, Feb 9 2025 12:23 AM

● రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ● పలువురు ఘర్షణ పడినట్లు ఆనవాళ్లుకొణిజర్ల: అనుమానాస్పద స్థితిలో ఓ ఆటోడ్రైవర్ మృతి చెందిన ఘటన కొణిజర్ల మండలం గోపవరం సమీపాన శనివారం వెలుగుచూసింది. ఎస్ఐ జి.సూరజ్, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన చాట్ల భిక్షం(45) ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొణిజర్ల సెంటర్ నుంచి చింతకాని మండలం ప్రొద్దుటూరు వరకు నిత్యం ఆటో నడిపే ఆయన శుక్రవారం రాత్రి 9 గంటల సమాయన ఆటోలో ఇంటికి బయలుదేరినట్లు తెలిసింది. అదే సమయాన భిక్షం పెద్ద కుమారుడు శ్రీరామ్ ఫోన్ చేయగా ఒకరిద్దరు ప్రయాణికులు ఎక్కగానే వస్తానని చెప్పినట్లు సమాచారం. అనంతరం 10 గంటల తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోగా.. శనివారం ఉదయం గోపవరం సమీపాన గ్రీన్‌ఫీల్డ్ హైవే పక్కనే సాగర్ కాల్వకట్టపై భిక్షం మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పక్కనే ఆటో ఉండగా గోపవరానికి చెందిన అద్దంకి చిరంజీవి, మంగా చెన్నారావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చేరుకుని పరిశీలించగా మృతదేహంపై దెబ్బలు ఉండటం, హైవే పక్కనే మట్టి దిబ్బలపై మద్యం సీసాలు, పెనుగులాడినట్లు గుర్తులు ఉండటంతో భిక్షం సహా పలువురు మద్యం సేవించి ఉంటారని, ఆ తర్వాత ఏదో కారణంతో ఘర్షణ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆయన మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న కుటుంబీకుల ఫిర్యాదుతో వైరా ఏసీపీ ఎంఏ రహమాన్, సీఐ సాగర్‌నాయక్, కొణిజర్ల, చింతకాని ఎస్ఐలు సాగర్, నాగుల్‌మీరా పరిశీలించి వివరాలు ఆరా తీశారు. మృతుడు గత నెల వరకు ఆటో అడ్డా అధ్యక్షుడిగా పనిచేయగా ఆయనకు భార్య సుజాత, ఇద్దరు కుమారులున్నారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. Sun, Feb 9 2025 12:23 AM

● లలిత జ్యుయెలరీ మార్ట్ అధినేత కిరణ్‌కుమార్ ● ఖమ్మంలో షోరూంను ప్రారంభించిన మంత్రులు తుమ్మల, పొంగులేటిఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలో వైరారోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన లలిత జ్యుయెలరీ మార్ట్‌ను రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యుయెలరీ అధినేత డాక్టర్ ఎం.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ 41 ఏళ్లుగా దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా నిలుస్తున్న తమ సంస్థ 60వ షోరూంను ఖమ్మంలో ఏర్పాటు చేసిందని తెలిపారు. బంగారం, వజ్రం, వెండి ఆభరణాల ధరలను ఇతర షోరూంలతో పోల్చుకున్నాకే తమ వద్ద కొనుగోలు చేయాలన్నారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావనేది గుర్తుంచుకోవాలని, అధిక తరుగుతో నగలు కొని డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. తమ షోరూంలో తక్కువ తరుగుకే నగలు లభిస్తాయని చెప్పారు. కాగా, తగ్గింపు ధమాకా పేరిట అన్ని ఆభరణాలపై మార్కెట్ కంటే తక్కువ తరుగే కాక ఇంకో శాతం తగ్గింపు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని వజ్రాభరణాలపై క్యారెట్‌కు రూ.5 వేల తగ్గింపు, వెండి వస్తువులపై ప్రత్యేక తగ్గింపు ఉందని వెల్లడించారు. అలాగే, తమ షోరూంలో ప్రీ బుకింగ్ స్కీమ్ ఉందని, ఈ పథకంలో చేరిన వారికి 11 నెలల తర్వాత కూడా ఒక శాతం తరుగు లేకుండా నగలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని కిరణ్‌కుమార్ వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్ పాకాలపాటి విజయనిర్మల, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:23 AM

తల్లాడ: మండలంలోని గొల్లగూడెంనకు చెందిన గొల్లమందల రవికి డాక్టరేట్ లభించింది. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఉన్న భారతీయ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ద్వారా ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వృక్ష సంపద, వాటి పరిరక్షణ, ఆదివాసీలు ఉపయోగించే ఔషధ మొక్కలపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ లభించిందని రవి తెలిపారు. కాగా, 2020 నుంచి 2025 వరకు చేపట్టిన అధ్యయనంలో 1,131 వృక్ష జాతులను గుర్తించగా తెలంగాణలో ఉమ్మడి వరంగల్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యధిక వృక్షజాతులు ఉన్నట్లుగా తేలిందని వెల్లడించారు. తన పరిశోధనలో సహకరించిన డాక్టర్ డి.వీరాంజనేయులు, అసల్ల అప్పయ్య, భరత్‌లాల్ మీనా, డాక్టర్ రూప వాసుదేవన్, డాక్టర్ నాగజ్యోతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళంసత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ద్వారకాపురి కాలనీలో నిర్మిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి సత్తుపల్లికి చెందిన తోట వెంకట్రావు – బేబి సరోజిని జ్ఞాపకార్థం తోట రమేశ్‌బాబు – జానకీ దంపతులు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు శనివారం రూ.1.11 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆలయ కమిటీ బాధ్యులు ద్రోణంరాజు మల్లికార్జునశర్మ, వందనపు సత్యనారాయణ, సోమిశెట్టి శ్రీధర్, రాగాల చంద్రారెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్, రాజ్యాంగం సాక్షిగా వివాహంపెనుబల్లి: అన్నింట్లోకెల్లా రాజ్యాంగం, దాన్ని రచించిన అంబేడ్కరే ముఖ్యమని చెబుతూ యువతీ యువకులు వీటి సాక్షిగా వివాహం చేసుకున్నారు. పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ జార్ఘండ్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసే నాగజ్యోతితో వివాహం నిశ్చయమైంది. అయితే, అంబేడ్కర్ భావజాలం కలిగిన వీరిద్దరూ శనివారం టేకులపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక రాజ్యాంగం సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఇందులో కొచ్చర్ల శ్రీనివాసరావు, మీసాల రామచందర్‌రావు వివాహ కర్తలుగా వ్యవహరించారు. మాలమహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి మేకతొట్టి కాంతయ్యతో పాటు ఇరువురి బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రేషన్ దుకాణానికి తాళం వేసిన గ్రామస్తులురెండు షాపుల్లో నిల్వల్లో తేడా, కేసు నమోదుకామేపల్లి: బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదంటూ మండలంలోని బర్లగూడెం–1 రేషన్ షాపునకు గ్రామస్తులు శనివారం తాళం వేసి నిరసన తెలిపారు. బర్లగూడెం–1 డీలర్ లక్ష్మణ్‌కు బండి పాడు రేషన్ దుకాణాన్ని కొన్నేళ్ల కిందట ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించగా రెండుషాపులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం బండిపాడు లోని షాప్‌లో బియ్యం పంపిణీ చేపట్టగా కొందరి కే ఇచ్చాక మిగతా వారిని తర్వాత రమ్మని చెప్పా డు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ షా పునకు తాళం వేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఐ పవన్ చేరుకొని షాపులో బియ్యం నిల్వలను తనిఖీ చేయగా బండిపాడులో 17 క్వింటాళ్లు, బర్లగూడెం–1లో 38 క్వింటాళ్లు బియ్యం తక్కువగా వచ్చాయి. ఈ మేరకు డీలర్‌పై కేసు నమోదు చేసి రెండు షాపుల బాధ్యతలను బర్లగూడెం–2 డీలర్ వినయ్‌కుమార్‌కు అప్పగించినట్లు తహసీల్దార్ సుధాకర్ తెలిపారు. 33 క్వింటాళ్ల బియ్యం సీజ్ ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రకాష్‌నగర్ ప్రాంతానికి చెందిన కళ్లెం ఉపేందర్‌రెడ్డి 33 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నిల్వ చేశాడనే సమాచారం మేరకు త్రీటౌన్ పోలీసులు, సివిల్ సప్లయీస్ ఉద్యోగులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఉపేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడి ఘటనలో ఆరుగురిపై కేసుచింతకాని: బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్), ముష్టికుంట్లకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని నాగులవంచ పెట్రోల్‌బంక్‌కు గురువారం అర్ధరాత్రి గోవిందాపురం (ఎల్), ముష్టికుంట్లకు చెందిన నారపోగు హరీశ్, ఆదూరి గోపి, దారెల్లి వంశీ, ముత్తారపు నవీన్, బాజా సురేశ్, గూదాల మనోజ్ వచ్చారు. ఈ సందర్భంగా బంక్ సిబ్బందితో వారు గొడవ పడి దాడి చేశారు. ఘటనపై అంబటి శరత్‌కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్‌మీరా తెలిపారు. Sun, Feb 9 2025 12:23 AM

● వైభవంగా విష్ణుసహస్ర నామ పారాయణం ● సామూహిక స్తోత్ర పారాయణం చేయించిన జీయర్ స్వామి ● భారీగా హాజరైన భక్తులుభద్రాచలంటౌన్: విరాట్ విష్ణుసహస్ర నామ స్తోత్ర పారాయణ మహోత్సవంతో భద్రాచలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల ‘జై శ్రీరామ్.. జై శ్రీమన్నారాయణ’ నామస్మరణలతో భద్రగిరి మార్మోగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని వికాస తరంగిణి ఆధ్వర్యంలో శనివారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్‌స్వామి సారథ్యంలో సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్థానిక జీయర్ మఠం నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆరాధనా మూర్తులతో కళాశాల మైదానం వరకు శోభాయాత్ర సాగింది. భక్తుల రామనామ సంకీర్తనలు, ఆదివాసీల కొమ్ము నృత్యాలతో కనులపడువగా ప్రదర్శన చేపట్టారు. అనంతరం జీయర్‌స్వామి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ పుస్తకాలను ఆవిష్కరించి భక్తులకు పంపిణీ చేశారు. రెండు గంటల పాటు పారాయణం.. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం రెండు గంటల పాటు వీనులవిందుగా సాగింది. జీయర్ స్వామి భక్తులతో పారాయణం చేయించారు. వేదికపై కొలువుదీర్చిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆరాధనామూర్తులకు మధ్య మధ్య నైవేద్యం, హారతి సమర్పించారు. చివరిగా స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ.. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాలకులు ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాలని, స్వామివారికి భక్తుల సంఖ్య పెరిగి, వారి సంపద కూడా పెరగాలని అన్నారు. విష్ణుసహస్ర నామ స్తోత్ర పారాయణం చేసిన భీష్ముడికి అనంత బలం చేకూరిందని, అటువంటి పారాయణం చేస్తే భక్తులకు సైతం అంతే శక్తి వస్తుందని చెప్పారు. ప్రజలంతా రామదాసులైతే భగవంతుడు కూడా వారి వెంటే ఉంటాడన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న జీయర్‌స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విష్ణు సహస్రనామ పారాయణానికి సుమారు ఐదు వేల మంది భక్తులు హాజరు కాగా, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 300 మంది వలంటీర్లు సేవలందించారు. సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో దేవానంద రామానుజ జీయర్ స్వామి, వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు, జీయర్ మఠం అధ్యక్షుడు గట్టు వెంకటాచార్యులు, చక్రవర్తి, రాము, రాఘవరెడ్డి, శ్రీనివాసరావు, కమలకుమారి, సీతామహాలక్ష్మి, అల్లం నాగేశ్వరరావు, నర్సింహారావు, హరిశ్చంద్ర నాయక్, వైద్యులు జయభారతి, సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:23 AM

చింతకాని: దేవరపల్లి – సూర్యాపేట జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చింతకాని మండలం బస్వాపురం వద్ద అండర్ పాస్ ఇవ్వాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజైన శనివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బస్వాపురం నుంచి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అల్లీపురం గ్రామం వరకు 53 అడుగుల ప్రభుత్వ డొంక రహదారి ఉందని, జాతీయ రహదారిపై అండర్‌పాస్ ఇవ్వకపోతే సుమారు 100 ఎకరాల్లో ఉన్న పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ నేపథ్యాన అండర్‌పాస్ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. వివిధ పార్టీల నాయకులు, రైతులు కన్నెబోయిన గోపి, సయ్యద్ ఉస్మాన్, రాసాల మోహన్‌రావు, మార్గం శ్రీను, బొడ్డు వెంకట్రామయ్య, చంద్రకాని కోటేశ్వరరావు, నర్సింహారావు, పేరబోయిన రవి, ముప్పారపు సైదులు తదితరులు పాల్గొన్నారు. Sun, Feb 9 2025 12:23 AM

నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఏపీలోని విజయవాడకు చెందిన షేక్ రజాక్ (35) హైదరాబాద్ వెళ్లి బైక్‌పై తిరిగి స్వస్థలాలకు పయనమయ్యాడు. ఖమ్మం నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్తుండగా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నేషనల్ హైవే పెట్రోలింగ్ వాహనం సిబ్బంది ఆయనను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై రజాక్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థి... పెనుబల్లి: మండలంలోని లంకపల్లి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థి రావిలాల పవన్‌సాయి (18) ఖమ్మంలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మండాలపాడుకు చెందిన పవన్ సాయి తన సోదరిని స్కూల్ బస్సు ఎక్కించి వస్తుండగా మార్గమధ్యలో లంకపల్లి శివారు వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. Sun, Feb 9 2025 12:23 AM
బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల ఉన్నత పాఠశా ల పీఎంశ్రీ పథకానికి ఎంపికై ంది. ఈ పథకం ద్వారా నాలుగేళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.కోటి మేర నిధులు విడుదల కానున్నాయి. ఇందులో భాగంగానే విద్యార్థుల విహారయాత్ర కోసం నిధులు విడుదల చేయగా శనివారం రావినూతల ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు సందర్శించారు. బోధన, అభివృద్ధి కార్యక్రమాలను తహసీల్దార్ పున్నంచందర్, ఎంఈఓ పుల్లయ్య, హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఆర్ఐ లక్ష్మణ్, ఉపాధ్యాయులు పరిశీలించారు. మూడు రోజుల కిందట ఖమ్మం వెలుగుమట్ల పార్క్‌కు తీసుకువెళ్లగా ఆదివారం లక్నవరం, రామ ప్ప, వేయిస్తంభాల ఆలయాలను చూపించనున్నారు. Sun, Feb 9 2025 12:22 AM
బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల ఉన్నత పాఠశా ల పీఎంశ్రీ పథకానికి ఎంపికై ంది. ఈ పథకం ద్వారా నాలుగేళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.కోటి మేర నిధులు విడుదల కానున్నాయి. ఇందులో భాగంగానే విద్యార్థుల విహారయాత్ర కోసం నిధులు విడుదల చేయగా శనివారం రావినూతల ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు సందర్శించారు. బోధన, అభివృద్ధి కార్యక్రమాలను తహసీల్దార్ పున్నంచందర్, ఎంఈఓ పుల్లయ్య, హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఆర్ఐ లక్ష్మణ్, ఉపాధ్యాయులు పరిశీలించారు. మూడు రోజుల కిందట ఖమ్మం వెలుగుమట్ల పార్క్‌కు తీసుకువెళ్లగా ఆదివారం లక్నవరం, రామ ప్ప, వేయిస్తంభాల ఆలయాలను చూపించనున్నారు. Sun, Feb 9 2025 12:23 AM